గురుదేవో భవ
* ఘనంగా గురు పూజోత్సవ దినోత్సవ వేడుకలు
* మొరంపల్లి బంజరలో గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేగా కాంతారావు
* తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేటుకు దీటుగా ప్రభుత్వ బడులు
** మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే:ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్,బూర్గంపాడు:తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు. కానీ, మనిషిలోని మూఢత్వాన్ని తొలగించి, మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో శిష్యుడికి గురువు విద్యను బోధిస్తాడు. తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తానంటాడు శిష్యుడు. ఇదీ గురుశిష్యుల సంబంధం.
బూర్గంపాడు మండల వ్యాప్తంగా గురుపూజోత్సవ వేడుకలు మంగళవారం ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఘనంగా నిర్వహించారు. మొరంపల్లి బంజర లోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత దేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.ఉత్తమ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సనాతన భారతదేశంలో గురుకు ప్రత్యేకమైన స్థానం ఉన్నదని వెల్లడించారు. గురువు బోధించిన మార్గంలో ప్రయాణిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందిస్తున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంలో ప్రభుత్వ బడులు బలోపేతం అవడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేగా పాఠశాల విద్యార్థులతో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
