విద్యార్థుల సమస్యలపై పోరాటాలు ఏవి!
* విద్యార్థి సంఘాలు ఉన్నాయా లేవా?
* సమస్యల మధ్య కొనసాగుతున్న విద్య బోధన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాల పోరాటాలు తగ్గినట్లు ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. పలు అసౌకర్యాల, సమస్యల మధ్య విద్యా బోధన జరుగుతుంటే విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయని అసలు విద్యార్థి సంఘాలు ఉన్నాయా లేవా అంటూ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు సంధిస్తున్న పరిస్థితి నెలకొంది. భద్రాద్రి జిల్లా కేంద్ర సమీపంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కళాశాలలకు ప్రహరీ మరుగుదొడ్లు సరిగ్గా లేక విద్యార్థులు విద్యార్థినిలు అవస్థలు పడుతున్నట్లు ప్రజాసంఘాల నుండి ఆరోపణలు రావడం జరుగుతుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల కొన్ని సంవత్సరాలుగా సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ కళాశాలకు సరైన సౌకర్యాలు లేక విద్యార్థిని విద్యార్థులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా కళాశాలకు చుట్టు ప్రహరీ లేక రక్షణ కరువైంది. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. క్రీడామైదానంలో ఆటల పరికరాలు లేక గ్రౌండ్ వెలవెలబోతుంది. ఈ మైనింగ్ కళాశాలలో విద్యార్థులు సమస్యల మధ్య విద్యాబోధన జరుగుతుంటే విద్యార్థి సంఘాలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణ రావడం గమనించాల్సిన విషయం. ఇప్పటికైనా సంఘాలు మేల్కొని నవభారత్ మైనింగ్ కళాశాలలో పలు ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.