రోడ్డెక్కిన చంద్రన్న సైన్యం..
* జాతీయ రహదారిపై రాస్తారోకో
* వాహనాలపై నిరసన ర్యాలీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేయడానికి ఖండిస్తూ పాల్వంచ పట్టణానికి చెందిన చంద్రబాబు అభిమానులు ఆదివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. అంతేకాకుండా బస్టాండ్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మోటార్ సైకిళ్లపై నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా అందరూ ఒకచోటకు చేరి జై చంద్రన్న అంటూ తమ గలాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విధానం మార్చుకోవాలన్నారు. లేకుంటే జగన్ పరిపాలనకు చరమగీతం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు.