మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం పరిధిలోని కలివేరు గ్రామపంచాయతీలో ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ కరువవుతోంది. ప్రయాణికుల కోసం నిర్మించిన బస్ షెల్టర్ లో ఇప్పుడు మేకలు దర్శనమిస్తున్నాయి. అది కూడా బస్ షెల్టర్ చుట్టూ ముళ్లకంచను పగడ్బందీగా కట్టి ప్రయాణీకులను లోనికి పోనివ్వకుండా మేకలను బస్సు షెల్టర్ నుండి బయటకు రానివ్వకుండా చాలా పగడ్బందీగా ఆ మేకల ఆసామి బస్ షెల్టర్ ను మేకలదొడ్డిగా ఏర్పాటు చేశాడు. చేసేదేమీ లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్లపైనే వారు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇదే బస్సు షెల్టర్ పై గతంలో పలు పేపర్లలో కథనాలు ప్రచురించిన పంచాయతీ వారి చర్యలు శూన్యం గా ఉన్నాయి. ఇంత జరుగుతున్న తమకేమీ పట్టనట్టు పంచాయతీ వారు వ్యవహరించటం సంబంధిత ఆసామి ని పిలిచి మందలించటం లాంటిది చేయకపోవడంతో. గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా బస్టాప్‌లలో షెల్టర్లే లేవు. ఉన్నచోట నిర్వహణ అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్న చోట్ల బస్టాప్‌లలో బస్సులు ఆపక రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. అసలే వాన కాలం ప్రయాణికులు తలదాచుకునే షెల్టర్లు లేక ఎలా ప్రయాణించాలని వారు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్ షెల్టర్ ను మేకల దొడ్డిగా మార్చిన వ్యక్తిపై చర్యలు తీసుకొవాలని అలాగే బస్ షెల్టర్ ను పునః ప్రారంభం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
