మార్కెట్ అభివృద్ధితో కొత్త శోభ..
* ముమ్మరంగా అభివృద్ధి పనులు
* ఇంటిగ్రేటెడ్ కు 450 లక్షలు
* వీధి వ్యాపారుల యార్డుకు 35 లక్షలు
* నూతన మున్సిపల్ మార్కెట్ కు 100 లక్షలు
* ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు రోడ్డు వెడల్పుకు 80 లక్షలు
* మార్కెట్ రూపురేఖలు మారుతున్నడంతో వ్యాపార వర్గాల్లో హర్షాతిరేకాలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలను నిర్వహించుకునేందుకు ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసి వారికి కనీస సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వచ్చి కోట్ల రూపాయలను మంజూరు చేసిన విషయం తెలిసింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి మార్కెట్ విస్తరణ నిర్మాణాలు చేపట్టడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పాత రైతు బజార్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటుగా మార్కెట్ ఏరియా విస్తరణ కొరకు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల స్థానిక శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులు తాజా పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. దీంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి స్టేట్ గ్రాంట్ కింద 450 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన మున్సిపల్ మార్కెట్ నిర్మాణం కొరకు ఒక కోటి రూపాయలను మంజూరు చేశారు. చిరు వీధి వ్యాపారుల యార్డ్ కొరకు పట్టణ ప్రగతి నిధుల కింద 35 లక్షలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. మార్కెట్ కు విశాలంగా వినియోగదారులు వెళ్లేందుకు రోడ్లు వెడల్పు పనులు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు జరిగే పనులకు 80 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో జరుగుతున్న పనుల వల్ల మార్కెట్ కు కొత్త శోభ సంతరించుకోనున్నది. వ్యాపారాలను చేసుకునేందుకు కొందరికి గదుల పద్ధతిలో మరికొందరికి ఓపెన్ గా చేసుకునే వీలుగా మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వ్యాపార వర్గాల్లో సంతోషం వ్యక్తమౌతుంది. మరుగుదొడ్లతో పాటుగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పాత మార్కెట్ యార్డ్ కి ఇప్పుడున్న మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న నిర్మాణ పనులతో మున్సిపల్ మార్కెట్ రూపురేఖలు మారడంతో పాటు విద్యుత్ కాంతులతో కళకళలాడనున్నది.