కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం
* పోలీసులు, అధికారులతోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించుకుంటారా..?
* సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయండి
* డిమాండ్లపై స్పందించకుండా బెదిరింపులకు పాల్పడితే సహించం
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
క్రమబద్దీకరణ హామీని అమలు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెబాటపడితే జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తాత్కాలిక ఉద్యోగులను, స్కీమ్ వర్కర్లను బయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వానికి తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. క్రమబద్ధీకరణ హామీ, కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు, విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ ఏర్పాటు చేసిన నిరసన శిభిరాలను మంగళవారం ఆయన సందర్శించి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పరాయి చేతిలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెట్టిన కేసీఆర్ వారి బాటలోనే నిరంకుశ విధానాలను పాల్పడుతూ స్కీమ్, తాత్కాలిక కార్మికుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నాడని విమర్శించారు.
ప్రజాస్వామ్య పద్దతిలో అంగన్వాడీ సిబ్బంది సమ్మె చేస్తుంటే పోలీసులను, అధికారులను ఉసిగొల్పి కేంద్రాలను స్వాధీనం చేసుకునే చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య, సిపిఐ జిల్లా నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, యూసుఫ్, గోనె సురేష్, అంగన్వాడీ అసోషియేషన్ల నాయకులు గోనె మణి, విజయవాణి, విజయ, ప్రమీల, జానకి, రామలక్ష్మి, రమా, సరోజ, సమగ్ర శిక్ష సిబ్బంది మోహన్, చందూలాల్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.