మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం స్థానిక బస్టాండ్ చౌరస్తా లో ఉన్న సింగరేణి చిల్డ్రన్ పార్క్ వద్ద నిరసన దీక్షను తాను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ నిరసన దీక్షకు జర్నలిస్టులంతా హాజరై జయప్రదం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజా సమస్యలను మీడియా ద్వారా తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్లస్థలాలతో పాటు ఇంటి నిర్మాణం సైతం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా రుణ సదుపాయం కూడా కల్పిస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుందని కామేష్ ప్రభుత్వానికి సూచించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా కనీస సదుపాయాలు వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.