నాన్నకు ఎంత కష్టం
జాలి లేని కొడుకు…
అనాధగా బస్టాండ్ లో బిక్కు.. బిక్కు మంటు తండ్రితండ్రి
దాతల సహాయం కోసం ఎదురుచూపు
మన్యం న్యూస్,భూర్గంపాడు:
అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తుంది. తండ్రి మాత్రం ఆ బిడ్డకు జీవితాన్ని ప్రసాదిస్తాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిస్తుంటాడు. అలాంటి మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు.
జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అంత గొప్ప మనసు ఉన్న నాన్న కన్న కొడుకు కఠినృదయంతో ఓ బస్టాండ్ లో అనాథగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. కనికరం లేని కసాయి కొడుకు పై యావత్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాంటి కొడుకును కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ హృదయ విధారకర సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
మండల పరిధిలోగల మోతే పట్టి నగర్ గ్రామంలోని బస్సు షెల్టర్ లో కన్న కొడుకుకు భారమై అనాధగా మారిన ఓ తండ్రి, అతని పూర్తి వివరాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ వృద్ధున్ని మంగళవారం మన్యం న్యూస్ పలకరించగా అతని పేరు బర్ల నారాయణ,కొడుకు పేరు బర్ల వెంకన్న అనే మాటలు వరకు చెప్పగలిగాడు. అతని ఆరోగ్యం సరిగా లేనందున పూర్తి వివరాల చెప్పడం వృద్ధునికి కష్టంగా మారింది . వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీద దయలేని పుత్రుడు ఎందుకు జాలి లేని కొడుకు కన్నా కుక్క మేలు అంటూ పలువురు ఆ వృద్ధుని కుమారునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు.స్వచ్ఛంద సంస్థలు అభివృద్ధినికి సహాయ, సహకారాలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
