పైరవీలకే పరిమితమైన ప్రభుత్వ పథకాలు
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలుచేయాలి
జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య
మన్యం న్యూస్,ఇల్లందు తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబందు, బీసీ, మైనారిటీ బందులతో పాటుగా గృహలక్ష్మి పథకాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల జోక్యంతో భారీగా అవినీతి జరిగిందని భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య వ్యాఖ్యానించారు. ఇల్లందు పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత, బీసీ, మైనార్టీ బందులతో పాటుగా గృహలక్ష్మి పధకాలపై ఇల్లందు తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా మూడోసారి అధికారం చేపట్టాలనే మోసపూరిత వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టిన దళిత, బీసీ, మైనారిటీ, గృహలక్ష్మి, పథకాల్లో నిజమైన లబ్ధిదారులకు కాకుండా అధికార పార్టీ పైరవీకారులు సూచించిన వారిని లబ్ధిదారులుగా ఎంపికచేయడం వల్ల నిజమైన అర్హులకు తీవ్రఅన్యాయం జరుగుతుందని తెలిపారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి దళితులపై చిత్తశుద్ధి ఉంటే అర్హులైన వారందరికీ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ప్రభుత్వపథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకంలో కేవలం మూడురోజులు గడువు కేటాయించి మద్యంషాప్ టెండర్లకు మాత్రం పదిహేను రోజులు గడువు కేటాయించిన ప్రభుత్వతీరును ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు. ఈ హడావిడి మోసపూరిత పథకాలు ఎన్నికల వుహంలో భాగమేనన్నారు. రాష్ట్రంలోని ప్రతీపేదవానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రానున్న ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం తహశీల్దార్ రవికుమార్ కు ప్రభుత్వ పథకాలు పేదలకు సక్రమంగా అందేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, ఎస్సీ, బీసీసెల్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, శంకర్, మసూద్, 19వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.