మాజీ మావోయిస్టు అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు
* మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లిన కుటుంబ సభ్యులు మన్యం న్యూస్,ఇల్లందు:మాజీ మావోయిస్టు కొడెం సమ్మయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సమ్మయ్య అంత్యక్రియలను కోర్టు వివాదంలో ఉన్న భూమిలో చేసేందుకు కుటుంబసభ్యులు యత్నించగా ఇల్లందు పోలీసులు అడ్డుకున్నారు. 2008లో నక్సలైట్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలో కలిసిన కొడేం సమ్మయ్యకు ప్రభుత్వం ఎకరం1.20 గుంటల భూమిని ఇచ్చింది. ఆ భూమి తనదేనంటూ ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా కబ్జాచేశాడంటూ కోడెం సమ్మయ్య, అతని కుమారుడు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఫిర్యాదుచేసి పలుమార్లు మొరపెట్టుకున్నా సంవత్సరాలు గడిచిన మృతుడు సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు నిరసనగా సమ్మయ్య అంత్యక్రియలు వివాదాస్పద స్థలంలో చేద్దామని వెళ్లగా, కోర్టు వివాదంలో ఉన్నభూమి లో అంత్యక్రియలు నిర్వహించవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ,మృతుడు సమ్మయ్య కుటుంబసభ్యులకు స్వల్ప తోపులాట జరిగింది. సమ్మయ్య అంత్యక్రియలను పోలీసులు అడ్డుకోవడంతో మృతదేహాన్ని వివాదాస్పద స్థలంలో విడిచిపెట్టు కుటుంబసభ్యులు ఇంటిబాట పట్టారు.
