UPDATES  

 రౌడీ షీటర్లు అసాంఘిక శక్తుల పట్ల ప్రత్యేక నిఘా

రౌడీ షీటర్లు అసాంఘిక శక్తుల పట్ల ప్రత్యేక నిఘా
* గణేష్ ఉత్సవాలకు పటిష్టమైన భద్రత
* జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మంటపాలను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నియమ నిబంధనలను వివరించాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి నిమజ్జనానికి భద్రాచలం వద్ద గోదావరి నదికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపుగా వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా రూట్ మ్యాప్ లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తుల కార్యకలాపాల పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పండుగల సమయాల్లో సాధారణంగా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి దూరప్రాంతాలకు వెళ్లే వారు జిల్లా నిఘా నేత్రం 7992123234 నంబరుకు వారి పేరు ఇంటి చిరునామా జీపిఎస్ లొకేషన్ ను వాట్సాప్ ద్వారా పంపి పోలీసులకు సమాచారం అందిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేస్తామని తెలియజేసారు. ఈ విధంగా చేయడం ద్వారా దొంగతనాలు జరగకుండా నివారించవచ్చని అన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలియజేసారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసి భాదితులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !