మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ప్రజలకు సూచించారు.
శనివారం ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటుపై తయారు చేసిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం వల్ల నీటిలో బ్రతికే ప్రాణులకు హాని కలుగుతుందని తద్వారా జీవరాసుల మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అందువల్ల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని భక్తులు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. వినాయక చవితి పండుగను నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి
ఈ ఈ రవీందర్ జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయక ప్రతిమను అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్వో రవీంద్ర నాధ్, దేవస్థానం ఈ ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.