మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రశాంతమైన వాతావరణంలో జరిగే గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు తప్పని సరిగా విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. శనివారం ఐడిఓసి మిని సమావేశపు హాలులో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాలపై రెవిన్యూ పంచాయతీరాజ్ విద్యుత్ మున్సిపల్ మత్స్య ఇరిగేషన్ అగ్నిమాపక దేవాదాయ శాఖ తదితర శాఖల
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అనుమతి
లేకుండా అక్రమ విద్యుత్ వినియోగం నేరమని లూజువైర్లు ద్వారా విద్యుత్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని
చెప్పారు. శోభాయాత్రలో విగ్రహాలు విద్యుత్ తీగలకు తగలకుండా తక్కువ ఎత్తున్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని
భక్తులకు సూచించారు. మండపాలను విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి రక్షణ చర్యలను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. మండపాల్లో మైకు ఏర్పాట్లుకు తప్పని సరిగా పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని చెప్పారు. మండపాల వద్ద పరిశుభ్రత ఉండేందుకు ఏ రోజు వ్యర్థాలను ఆ రోజు తొలగించాలని మున్సిపల్ పంచాయతీ
అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లుకు ప్రమాదాలకు తావు లేకుండా ఉత్సవాలను నిమజ్జనాలను
నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డీఓ రవీంద్రనాధ్, డిపిఓ రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, దేవస్థానం ఈఓ రమాదేవి, మత్స్యశాఖ అధికారి వీరన్న,
మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు శిరీష, మంగీలాల్ ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.