గులాబీ గూటికి కోనేరు చిన్ని
* కేటీఆర్ సమక్షంలో చేరిక
* 3 వేల మందితో హైదరాబాద్ కు
* 300 కార్లలో ర్యాలీగా రాజధానికి
* కొత్తగూడెంలో తోరణాలతో గులాబీమయం
* జోష్ లో కోనేరు చిన్ని అభిమానులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మంగళవారం హైదరాబాదులోని ప్రగతి భవన్ లో బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే టీ ఆర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోనేరు చిన్నికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోనేరు చిన్ని చేరిక సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుండి 3 వేల మందితో 300 కార్లలో చిన్ని అభిమానులు ర్యాలీగా హైదరాబాదుకు తరలి వెళ్లారు. కొత్తగూడెం పట్టణంలోని భారీగా పార్టీ గుర్తు తోరణాలు కట్టడంతో గులాబీ మయంగా మారింది. చిన్ని గులాబీ కండువా కప్పుకోవడంతో ఆయన అనుచరులు జోష్ లో మునిగితేలారు.
కొత్తగూడెంను కార్పొరేషన్ గా మార్చాలి…
మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిక అనంతరం కోనేరు చిన్ని మాట్లాడుతూ కొత్తగూడెంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారు. అదేవిధంగా కొత్తగూడెంను కార్పొరేషన్ గా మార్చాలని కోనేరు చిన్ని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, వైరా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మదన్ లాల్, ముఖ్య నాయకులు, కోనేరు చిన్ని అభిమానులు తదితరులు పాల్గొన్నారు.