చెరువు మాయం.. వెంచర్ దర్శనం!
* ఏజెన్సీలో జోరుగా రియల్ దందా
* ఇష్టారాజ్యంగా భూముల అమ్మకాలు
* 1/70లో నిబంధనలకు తూట్లు
* పట్టించుకోని అధికారులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఒకప్పుడు నీటితో కళకళలాడిన ఆ చెరువు నేడు పూర్తిగా మాయమై వెంచర్ గా దర్శనమివ్వడం విశేషం. ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ దందా
జోరుగా సాగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ఫ్లాట్లు ఆరు బిల్డింగ్ లుగా కొనసాగుతుంది. ఈ పంచాయతీ పూర్తిగా 1/70 ఏరియా అయినప్పటికీ రియల్ జోరు దూకుడుగా ముందుకు పోతుంది. ఈ పంచాయతీలో సుమారు రెండు ఎకరాల్లో చెరువు ఉండేది. ఆ చెరువుపై కొందరి కబ్జాదారుల కన్ను పడి అట్టి చెరువును దశలవారీగా చదును చేస్తూ వెంచర్ గా మార్చేశారు. తర్వాత భూమిలో ప్లాట్లుగా చేసి ఇటు కొందరు ప్రభుత్వ టీచర్లకు అటు మరి కొందరు సింగరేణి కార్మికులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చదును చేసిన భూమిలో కొందరు చిన్న చిన్న గదులు కట్టుకొని వాటికి ఇంటి నెంబర్ సైతం తీసుకున్నట్లు ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. చెరువును మాయం చేసి రియల్ వ్యాపారం చేస్తున్న కబ్జాదారులపై కొందరు గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ కి, ఇప్పుడున్న కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన రామాంజనేయ కాలనీలో రియల్ వ్యాపారం జరగడం పట్ల కొందరు ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు
పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్
వ్యాపారం ఇప్పుడు పల్లె ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా మండల కేంద్రాల
చుట్టూ ఖాళీ జాగా కనిపిస్తే చాలు రియల్ వ్యాపారులు అక్కడ వాలి పోయి ప్లాట్లుగా మార్చేస్తూ అమ్మేసుకుంటున్నారు. మండలాల్లో విచ్చలవిడిగా అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధన ప్రకారం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్లను ఏర్పాటు చేస్తే 10 శాతం భూమిని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు 33 ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ
అలాంటి నిబంధనలేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది వెంచర్కు ఎలాంటి అనుమతులు లేవని ప్రచారం చేయడంతో పాటు ఎవరైనా ప్లాట్లు కొన్నా.. అమ్మినా తమకెలాంటి బాధ్యత లేదని హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చర్చనీయాంశంగా మారింది.
చెరువు స్థలం కబ్జా దారుణం: వార్డు మెంబర్ నవతన్…
రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చెరువునే ఏకంగా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రామాంజనేయ కాలనీ వార్డ్ మెంబర్, భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నవతన్ డిమాండ్ చేశారు. గతంలో చెరువు ఉన్నప్పుడు రైతులకు ఎంతో ఉపయోగపడేదని పేర్కొన్నారు. నేడు చెరువుని మాయం చేయడం వల్ల రైతులకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మాయం చేసిన చెరువును మరల చెరువు చెరువుగా మార్చి రైతులకు లోతట్టు ప్రాంత వాసులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని నవతన్ డిమాండ్ చేశారు.
