- మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాలు
- మీ ఉద్యమాలు, వారోత్సవాలు ఆదివాసి అభివృద్ధికి ఉపయోగపడతాయా?
- మావోయిస్టులకు సూటి ప్రశ్నలతో ఆదివాసి సంఘాల పేరునా కరపత్రాలు
మన్యం న్యూస్ చర్ల:
మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఎందుకు జరుపుకోవాలని ప్రశ్నిస్తూ ఆదివాసీ సంఘాల పేరిట గురువారం చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో పెద్ద ఎత్తున కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాస సంఘాల పేరిట ఉన్న ఈ కరపత్రాలలో ప్రధానంగా మీ మావోయిస్టు పార్టీ వల్ల మా ఆదివాసుల బ్రతుకులు ఏమి మారాయి? గత 20 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ వల్ల ఆదివాసి ప్రజలకు ఒరిగింది ఏమిటి? ఇంకా ఎంతకాలం మేము కాలినడక?, సైకిల్ మీద ప్రయాణం చేయాలి? రోడ్లు లేక వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? మా ఇళ్లకు కరెంటు లేకుండా ఇంకెంతకాలం మేము చీకట్లో బతకాలి? మా ప్రాణాలు పోయినా మీ మావోయిస్టులకు మావోయిస్టు పార్టీకి అవసరం లేదా? మా పిల్లలు బడికి ఎందుకు వెళ్ళదు? మా ఊర్లోకి రోడ్లు ఎందుకు వేయనివ్వదు? మా ఊర్లకు ఆసుపత్రిలో ఎందుకు వద్దు? అంటూ మావోయిస్టులకు సూటి ప్రశ్నలతో సంధించిన కరపత్రాలు బస్టాండ్ ఆవరణలో ఆదివాసీ సంఘాలు పేరిట చెట్లకు, కూర్చునే బల్లలకు అంటించి ఉండడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. అభివృద్ధికి నోచుకోని ఆదివాసి గ్రామాలు లో ఇప్పటికి రోడ్డు మార్గం లేక వైద్యం కోసం జెట్టి కట్టుకొని మోసుకొని వచ్చే క్రమంలో తమ ప్రాణాలు పోతున్నాయని, ఈ స్వతంత్ర భారతంలో కరెంటు లేక చీకటి లోనే తమ గ్రామాలు ఉన్నాయంటూన్నారు. అవగాహన లేని ఏవేవో దినోత్సవాలు జరుపుకుంటూ మీటింగులకు రావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అమాయక ఆదివాసీలను ఇన్ ఫార్మర్లు అనే నేపంతో ప్రాణాలు తీస్తున్నారని, మావోయిస్టు పార్టీ ఉద్యమం వలన తమ గ్రామాల్లో రోడ్లు, విద్య ,వైద్య తో కూడిన మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధి అనేది లేదంటూ తమ ఆవేదన కరపత్రాలు ద్వారా మావోయిస్టు పార్టీలకు తెలుపుతున్నట్టు ఆదివాసి సంఘాల పేరిట మండల కేంద్రంలో దర్శనమిస్తున్నాయి.