రైతు వేదిక స్థలంపై బిజెపి నేత కన్ను
* ఐదో వార్డులో అడ్డగోలుగా ఆక్రమణల పర్వం
* జీవో నెంబర్ 76 ను అడ్డం పెట్టుకొని ఇంటి స్థలానికి దరఖాస్తు
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ప్రభుత్వ రైతువేదిక స్థలాన్ని కాజేసేందుకు బిజెపి పట్టణ అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డ్ గంగ హుస్సేన్ బస్తీలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంగా చెప్పబడి రైతు వేదికను నిర్మించిన చోటనే 8 వేల గజాలు స్థలం తమదేనంటూ బిజెపి పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అగర్వాల్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు జీవో నెంబర్ 76 ను అడ్డం పెట్టుకొని ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. 2019లో ఈ తతంగం జరిగిందని అప్పటి జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైనీ ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి నిర్మాణాలు కూల్చివేశారని తెలిపారు. కొంతమంది మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్రమ సంపాదనకు అలవాటు పడి కలెక్టర్ కూల్చివేసిన ప్రదేశంలో ఇంటి నెంబర్లను రద్దు చేయాల్సి ఉండగా అక్రమార్కులు ఇచ్చే అవినీతి సొమ్మును తీసుకొని అదే ఇంటి నెంబర్లను కొనసాగిస్తూ ఉన్నారని ఆరోపించారు. మళ్లీ అదే స్థలంలో ఈ ఏడాది జూన్ నెలలో జీవో నెంబర్ 76 ను అడ్డం పెట్టుకొని బిజెపి పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ అగర్వాల్ ఆయన భార్య బంధువులు అనుచరులు 2820 గజాల ప్రభుత్వ స్థలాన్ని మరోమారు కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. జీవో నెంబర్ 76 మొదలైన నుంచి ఇప్పటివరకు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలను ఆయా వార్డుల పరిధిలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ఈ జీఓని అడ్డం పెట్టుకొని ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీలోని నాయకులు, బడా కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ స్థలాలను కాజేసేందుకు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఒక జాతీయ పార్టీకి పట్టణ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ స్థలం అని చెప్పినప్పటికీ 2820 గజాల స్థలానికి దరఖాస్తు చేసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. 2019లోనే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ స్థలం అని ప్రకటించిన తర్వాత 2023వ సంవత్సరంలో అది ప్రైవేటు వ్యక్తుల స్థలంగా ఎలా మారిందో మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ స్థలాలను అప్పన్నంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు జరుగుతున్న ఈ భూదోపిడిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, అసెంబ్లీ చేరికల కమిటీ చైర్మన్ గుడివాడ రాజేందర్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లకొండ శరత్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.