పాత కక్ష,మద్యం మత్తులో హత్య
బొజ్జాయిగూడెం హత్యకేసు మిస్టరీని చేధించిన ఇల్లందు పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమణమూర్తి *మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మండలంలోని బొజ్జాయిగూడెం జామాయిల్ తోట సమీపంలో ఈ నెల 19న జరిగిన మారుతి శ్రీనివాస్ హత్యకేసును ఇల్లందు పోలీసులు చేధించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణమూర్తి వివరాలను వెల్లడించారు. గతంలో శ్రీనివాస్ తో జరిగిన ఘర్షణల నేపథ్యంలో బొజ్జాయిగూడెం గ్రామానికి చెందిన నరేందర్(21), లారీ క్లీనర్ వెంకటేష్(22), రోహిత్(23) లు మద్యం సేవించి మద్యం మత్తులో శ్రీనివాస్ ను హత్యచేశారని తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని కొంతదూరం లాక్కెళ్లి పడేసారని అన్నారు. మృతుడి సెల్ ఫోన్లోని సమాచారాన్ని తొలగించేందుకు స్థానికులైన నరేష్, మల్లేష్ లు నిందితులకు సహకరించారని పేర్కొన్నారు. హత్య జరిగిన విషయం తెలిసినప్పటికీ నిందితుల విషయాన్ని పోలీసులకు చెప్పకుండా వారిని పారిపొమ్మని సలహా ఇచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసులు పెట్టి వారిని కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.