UPDATES  

 కెసిఆర్ పాలనలో అవినీతి రాజ్యం

కెసిఆర్ పాలనలో అవినీతి రాజ్యం
* మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే సింగరేణి కనుమరుగు
* హుజురాబాద్ శాసనసభ్యులు
ఈటెల రాజేందర్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కెసిఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని.. దొడ్డి దారిన సంపాదించిన సొమ్ముతో కెసిఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బిఆర్ఎస్ లోకి చేర్చుకోవడం జరుగుతుందని.. మరల కేసీఆర్ కు పట్టం కడితే సింగరేణి కాలరీస్ కంపెనీ కనుమరుగు అవడం గ్యారెంటీ అని హుజురాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. ఇలా చేయడం వల్ల రోజురోజుకు రాజకీయాలు దిగజారిపోతున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ తక్కువ కాలంలో వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆయన కుటుంబానికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రెవెన్యూ వైద్యం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐటి పరిశ్రమలు ఆర్థిక శాఖ ఇలా ముఖ్యమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే తత్వం చైతన్యం ఉన్న నాయకులను అష్టదిగ్బంధనం చేసి బిఆర్ఎస్ ప్రభుత్వంలోకి లాక్కుంటున్నారని తెలిపారు. దళిత బంధు పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భారతదేశ చరిత్రలో ఇంత డబ్బు ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం దేశంలో లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఉద్యోగ పరీక్ష నిర్వహించిన పేపర్ లీక్ కావడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టి హామీలను సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగ భృతి లేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు అది ఎక్కడ అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. పేదల సొంత ఇంటి కల ఎక్కడ నెరవేర్చారని విమర్శించారు. కెసిఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసారని విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ ను గెలిపిస్తే తెలంగాణలో రౌడీ రాజ్యం దోపిడి రాజ్యం పెరిగిపోతుందన్నారు. ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న బిజెపిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు కె.వి రంగా కిరణ్, ఎడ్లపల్లి శ్రీనివాస్, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సోమ సుందరం, వెంకటేశ్వర్లు, ఆకుల నాగేశ్వరరావు, గోపికృష్ణ, వంశీకృష్ణ, రవీందర్, రాయల నాగేశ్వరరావు మాలోత్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !