ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం
* రాత్రి వేళల్లో ఇసుక రవాణా జరిపితే చర్యలు
* జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న వాగుల నుండి గత కొన్ని నెలలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఫోకస్ పెట్టి చర్యలు చేపట్టారు.
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్ర సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ మిని సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్ లెవల్ స్యాండ్ కమిటీ సమావేశంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా చేపట్టవలసిన చర్యలపై మైన్స్ ఆర్అండ్బి ఇరిగేషన్ టిఎస్యండిసి మున్సిపల్ పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులతో సమీక్షించి పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గోదావరి, కిన్నెరసాని నదులకు సంబంధించి మండలాల్లో నిర్వహిచబడుచున్న ఇసుక రీచ్‌ల ద్వారా జిల్లాలో ఇసుక రవాణాకు రెవెన్యూ శాఖ గుర్తించిన వాహనాల ద్వారనే ఇసుక ర్యాంపుల నుండి నియమనిబంధనలకనుగనణంగా నిర్మాణాలకు ఇసుకను విక్రయించాలన్నారు. జిల్లాలో గల ఇసుక రీచ్‌లలో ఇసుక లభ్యత, నిల్వలపై తణిఖీలు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎట్టి పరిస్థితులలో ఇసుక అక్రమ రవాణా జరుగరాదని ఆ దిశగా పోలీసు మైనింగ్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఒకే కూపన్ ద్వారా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించాలని అందుకు గాను చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సిసి కెమోరాల నిఘాతో వాహనాల తణిఖీ జరగాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పరంగా జరిగే నిర్మాణ పనులైన సి.సి రోడ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాలు, చిన్న తరహా కట్టడాలకు స్థానిక అవసరాలకు ఇసుక కొరత ఏర్పడకూడదని కలెక్టర్ అన్నారు. అక్రమ రవాణా జరిపే వాహనాలపై జరిమానాలను విధించాలని, వాహనాలకు నిర్దేశించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని ప్రధానంగా రాత్రివేళలు ఇసుక రవాణాను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు జి.పి.ఎస్ విధానాన్ని అమలుపర్చడం ద్వారా ఇసుక అక్రమరవాణాను పూర్తిగా నియంత్రించగలుగుతామని అందుకు గాను అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలపై కూడా నిఘా పెంచాలని ప్రభుత్వ స్థలాలు ఉన్న గుట్టలను తహశీల్దార్లచే గుర్తించి అక్రమ మట్టి త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అదికారి, జిల్లా పంచాయితీ అదికారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కలెక్టరేట్ పరిపాలన అధికారి, మైనింగ్ ఏ.డి , ఆర్.అండ్.బి, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు మండలాల తహశీల్దార్లు, ఎస్.హెచ్.ఓలు తదితరులు పాల్గొన్నారు.