ప్రజల మనసుల్లో “గద్దర్ పాటలు” పదిలం
* పోరు తెలంగాణకు ఆ గొంతుకే ఆయుధం
* పీడిత తాడిత అణగారిన వర్గాలకు గద్దర్ ఆట పాట ఒక భరోసా
* స్మారక స్ఫూర్తి సదస్సులో వక్తలు
* గద్దర్, జహీర్ అలీఖాన్కు సాంస్కృతిక నివాళులర్పించిన కవులు కళాకారులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: బతికున్నంతకాలం తన పాట.. ఆటను ఆయుధంగా మలిచి సమాజంలోని పీడిత, తాడిత, అణగారిన వర్గాలకు అందించి పోరాడే తత్వాన్ని నేర్పిన గద్దర్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని ప్రజాస్వామ్య విలువల ప్రతిష్టాపన లక్ష్యంగా తన తుదిశ్వాస వరకు పోరాడిన జహీర్ అలీఖాన్ అమరుడని, వీరి మరణం తెలంగాణలోని ప్రతి మానవ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర నాయకులు రాములు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వర్ రావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాధినేని వెంకటేశ్వర రావు, అవునూరు మధు, సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, రచయిత జయరాజ్, గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల అన్నారు. గద్దర్ అమరత్వం, జహీర్ లౌకికత్వంపై ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన స్మారక స్పూర్తి సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై గద్దర్ ముందుకు నడిచారని నాటి నైజాం పోరాటం నుండి తెలంగాణ పోరాటం వరకు దొరగడీల పాలన పోవాలని ప్రజల మాటలనే పాటలుగా అల్లి ప్రజలను చైతన్యం చేశారని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నా అంటూ ప్రజలపక్షా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవడన్నారు. జన చైతన్యం కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి స్వాస వరకు పోరాటం చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, నిర్వాహక కమిటీ కన్వీనర్ జెబి శౌరి, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో
కార్మిక సంఘాల నాయకులు గొల్లపల్లి దయానంద్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ముద్ద బిక్షం, ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు కూసపాటి శ్రీనివాస్, బందెల నర్సయ్య, డాక్టర్ రమేష్ బాబు, మరపాక రమేష్, ఎస్సి-ఎస్టీ నాయకులు కాల్వ దేవదాస్, టివిపిఎస్ నాయకులు జి.సతీష్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు కల్లోజి శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్, సుగుణారావు, సలిగంటి శ్రీనివాస్, కే. రత్న కుమారి, మైనార్టీ మహిళా నాయకురాలు ఫర్వీన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.