మన్యం వీరుడికి ఇచ్చే గౌరవం ఇదేనా!
* తుప్పల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం
* విగ్రహానికి రంగు మారి పగుళ్లు ఇస్తున్న వైనం
* అల్లూరి సీతారామరాజు సెంటర్ కనుమరుగేనా?
* అధికారులు నిర్లక్ష్యం పట్ల జనం మండిపాటు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భారత స్వాతంత్రం కోసం.. మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం తుప్పల్లో ఉండడం పట్ల పాల్వంచ పట్టణానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుప్పల్లో ఆయన విగ్రహాన్ని చూసిన వారంతా అల్లూరి సీతారామరాజుకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పలు పేర్లతో సెంటర్లు ఉన్నాయి. ఇందులో మన్యం వీరుడుగా ముద్రపడిన అల్లూరి సీతారామరాజు సెంటర్ కూడా ఉంది. అయితే ఈ సెంటర్ ఇప్పుడు సరిగ్గా పైకి వినబడడం లేదు. ఎందుకంటే ఆయన విగ్రహాన్ని ఒక చౌరస్తాలో గతంలో పెట్టడం జరిగింది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా అల్లూరి సీతారామరాజు సెంటర్ అంటూ ప్రతి ఒక్కరు స్మరించుకోవడం జరుగుతుండేది. ఇటీవల రోడ్డు వెడల్పులో భాగంగా కేటీపీఎస్ పవర్ ప్లాంట్ పక్కన ఒక సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తొలగించి ఓ మూలన పడేశారు. ఇప్పుడు ఆ విగ్రహం చుట్టూ పిచ్చి చెట్లు వెలసి తుప్పల్లో దర్శనమివ్వడం కలవరపెడుతుంది. అంతేకాకుండా విగ్రహం రంగు మారి అక్కడక్కడ పగుళ్లు నివ్వడం జరిగింది. నెలలు గడిచిపోతున్న తొలగించి పక్కనపెట్టిన సీతారామరాజు విగ్రహాన్ని తిరిగి మరల ఆ సెంటర్లో పెట్టకపోవడం పట్ల ఇది అల్లూరి సెంటర్ అనే పేరు కనుమరుగు అవుతుండడం పట్ల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అభిమానులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తొలగించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అదే సెంటర్లో పెట్టి ప్రతి ఒక్కరు స్మరించుకునే విధంగా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.