మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పాల్వంచలోని ఐ.డి.ఓ.సి. మీటింగ్ హాలు సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యంగుల జిల్లా నోడల్ అధికారి స్వర్ణ లత లెనినా
మాట్లాడుతూ సాధారణ ఓటర్లుగా నమోదు అయిన దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారు దివ్యాంగ ఓటర్లుగా నమోదు కావాలని తెలిపారు. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలి అనుకునే దివ్యాంగులు ఫామ్ -6, ఓటర్ కార్డు లో సవరణలు కొరకు ఫామ్ -8 దరఖాస్తులను నింపి సంబంధిత ఏరియా బి.ఎల్.ఓ ల ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ.వి.ఎం, వివిపాట్ ల వినియోగంపై అవగాహన కల్పించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులు అందరూ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకొని వందశాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికలలో దివ్యాంగుల కొరకు అన్ని పోలింగ్ స్టేషన్ల లో ర్యాoపు సౌకర్యం వీల్ ఛైర్స్ ను అందుబాటులో ఉంచటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి త్రినాథ్ బాబు, కొత్తగూడెం మున్సిపాలిటీ మేనేజర్ ఎల్. వి.సత్యనారాయణ, టీవిపిస్ అధ్యక్షులు గుండపునేని సతీష్, కళాబాబు, వరప్రసాద్, నరేష్, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.