మడత చూపు ఏ పార్టీ వైపు?
మడతకు జన నీరాజనాలు ప్రజల్లో చెక్కుచెదరని చరిష్మా మడత సొంతం జననేత ఏ పార్టీలో చేరతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ
మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీలో మడత వెంకట్ గౌడ్ ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మాజీ మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ గా మడత దంపతులు ఇల్లందు మున్సిపాలిటీకి అత్యధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ది చేసిన సంగతి విదితమే. ముప్పై ఏళ్ల పైగా రాజకీయ అనుభవం ఉన్న మడత గత ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాస్త స్తబ్దతగా ఉన్నారు. మడత తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవడం పట్ల పట్టణ ప్రజల్లో హర్షాతిరేకాలు వక్తమవుతున్నాయి. ప్రజా నాయకుడిగా మున్సిపాలిటి అభివృద్ధే కాకుండా ఆపద అంటూ తన దగ్గరకు వచ్చిన పట్టణ ప్రజలకు ఆర్థిక సహాయాలను అందించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి ప్రజల్లో సుస్థిర స్థానాన్ని మడత వెంకట్ గౌడ్ ఏర్పరచుకున్నారు. దసరా, వినాయకచవితి ఉత్సవాలు ఇల్లందులో ఘనంగా జరిగేందుకు కారణం మడత అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి నేటివరకు వినాయకచవితి ఉత్సవ మండపాలకు నిర్వాహక కమిటీ ఆహ్వానం మేరకు కలియతిరుగుతూ పట్టణంలోని 150 మండపాలకు 5వేలనుండి10 వేల వరకు విరాళాలను అందిస్తున్నారు. అదేవిధంగా ఏళ్లతరబడి దసరా ఉత్సవాలను తన సొంతఖర్చుతో సినీతారలను సైతం ఇల్లందుకు రప్పించి అత్యంత ఘనంగా నిర్వహించి మినీ మైసూర్ గా ఇల్లందుకు పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసి చరిత్ర సృష్టించారు. ఎందరు నేతలు వచ్చినా మడతలా మాత్రం కార్యక్రమాలు చేయలేరని ఇల్లందు పట్టణవాసులు మాట్లాడుకుంటున్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొంది ప్రజల హృదయాల్లో చెరగనిముద్ర వేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇల్లందులో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపును సైతం నిర్ణయించగల సామర్థ్యం మడత సొంతం. అంతటి చరిష్మా గల మడత కోసం వివిధ పార్టీలనేతలు ఇప్పటికే గాలం వేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తన అభిమానులు, ప్రజానిర్ణయం మేరకే తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఉంటుందని మడత వెంకట్ గౌడ్ స్పష్టంచేశారు. ప్రజల్లో మాస్ లీడర్ గా గుర్తింపుపొందిన మడత ఏ పార్టీలో చేరి ఎవరికి మద్దతిస్తారో, ఆయన చరిష్మా ఎవరికి కలిసొస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడకతప్పదు.