మన్యం న్యూస్, చర్ల:
చర్ల మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యులను,ఇతర సిబ్బందిని నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు బస్టాండ్ సెంటర్లో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సిరంజిలు కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఏజెన్సీ లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, ప్రభుత్వం మాత్రం ప్రజలకు వైద్యం అందించడం లో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ డాక్టర్ తో వైద్యం చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు,చర్ల ఆసుపత్రిలో ఒక ఎండీ జనరల్ మెడిసిన్, ఇద్దరు గైనకాలజిస్టులు, సర్జన్,30మంది ఇతర నర్సింగ్ స్టాఫ్ ని నియమించాలని డిమాండ్ చేశారు.డెంగ్యూ వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళడం వల్ల వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు, ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు, నిరాహారదీక్షలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, పొడుపుగంటి సమ్మక్క, బందెల చంటి, పామర్ బాలాజీ సింగ్, వరలక్ష్మి, శ్రీను లు కూర్చున్నారు,ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు, తాళ్లూరి క్రిష్ణ, మండల కమిటీ సభ్యులు దొడ్డి హరినాగవర్మ, శ్యామల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.