UPDATES  

 ములుగు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు

ములుగు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు
– ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం
– కళ్యాణ లక్ష్మి పథకానికి ములుగు జిల్లా స్పూర్తి
-14 వేల ఎకరాల పైగా పోడుభూముల పట్టాల పంపిణీ చేశాం
– కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
– ములుగుకు గోదావరి జలాలు తెచ్చేందుకు అవసరమైన చర్యలు
– ములుగు నియోజకవర్గానికి అదనపు గృహలక్ష్మి ఇండ్లు,ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి
– 180 కోట్లతో వైద్య కళాశాల,2.36 కోట్లతో 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
– ములుగు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
మన్యం న్యూస్,ములుగు:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారుమూల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని,గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు ప్రాంతం నేడు జిల్లా కేంద్రంగా ఏర్పడిందని, సమీకృత కలెక్టరేట్ ,ఎస్పీ భవనం,వైద్య కళాశాలతో ములుగు రూపు రేఖలు మారనున్నాయని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్,ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ములుగు జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వం ఇటీవల180 కోట్లతో మంజూరు చేసిన వైద్య కళాశాల నిర్మాణ పనులకు, 2 కోట్ల 36 లక్షల వ్యయంతో 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో 21.27 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ
(SNCU) కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు.అనంతరం జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో లబ్ధిదారులకు గృహలక్ష్మి ,దళిత బంధు, జంగాలపల్లి గ్రామంలో నివసిస్తున్న ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ,జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు పర్సనల్ కిట్ల పంపిణీ,భారీ వర్షాలలో పల్లెల్లో ఉత్తమ సేవలందించిన 11 మంది వైద్య సిబ్బందికి ప్రశంసపత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ములుగు నేడు అద్బుత పురోగతి సాధిస్తుందని, ములుగు జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే సమయంలో ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కుసుమ జగదీష్ తో కలిసి అనేక పోరాటాలలో పాల్గొనడం జరిగిందని, ములుగు అభివృద్ధి కోసం నిరంతరం తపన చెందిన జగదీష్ వైద్య కళాశాల శంకుస్థాపన సమయంలో ఉంటే చాలా సంతోషించే వారిని మంత్రి తెలిపారు. గతంలో మారుమూల ప్రాంతంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ములుగు, నేడు జిల్లా కేంద్రంగా మారి అద్భుత పురోగతి సాధించిందని, ములుగు అభివృద్ధికి కారణం సీఎం కేసీఆర్ చలవ మాత్రమేనని, రాజకీయాలకతీతంగా ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట ప్రకారం ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశామని అన్నారు.ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు సమీకృత కలెక్టరేట్ నిర్మాణం,ఎస్పీ భవన నిర్మాణం,వైద్య కళాశాలను మంజూరు చేసుకున్నామని,నేడు 180 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల పనులు శంకుస్థాపనచేసే ప్రారంభించుకున్నామని, వచ్చే సంవత్సరం నుంచి ములుగు జిల్లాలో వైద్య కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థికసాయం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ములుగు జిల్లా స్ఫూర్తి అందించిందని,ఉద్యమ సమయం 2002 లో భాగ్యతండా 12 మంది గిరిజనుల గుడిసెలు కాలిపోయాయని,కీమా నాయక్ అనే వ్యక్తి తన కూతురు వివాహం కోసం దాచిన 50 వేల రూపాయల తగలబడి పోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారని,అప్పుడు ఉద్యమ నాయకుడు కేసిఆర్ సొంత ఖర్చులతో ఆ వివాహం జరిపించారని మంత్రి తెలిపారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదింటిటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కష్టం రావద్దని కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని,రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 లక్షల 71 వేల ఆడపిల్లల పెండ్లి కోసం 11 వేల కోట్లకు పైగా నిధులను పెండ్లి కూతురు తల్లి పేరు మీద సీఎం కేసీఆర్ అందించడం జరిగిందని,ములుగు నియోజకవర్గ పరిధిలో 10 వేల 586 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కులు అందించామని మంత్రి అన్నారు.

గృహలక్ష్మి పథకాన్ని సైతం ప్రభుత్వం ఇంట్లో ఉన్న మహిళల పేరుపై మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు.గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో మూడు లక్షల ఎకరాల పోడు భూముల పట్టా పంపిణీ చేస్తే, నేడు సీఎం కేసీఆర్ నాలుగు లక్షల ఆరువేల ఎకరాల పోడు భూములను గిరిజనులకు పంపిణీ చేశారని, ములుగు నియోజకవర్గ పరిధిలో 14 వేల ఎకరాల పంపిణీ జరిగిందని తెలిపారు.గిరిజనులకు పోడు భూములు పట్టా పంపిణీ చేయడంతో పాటు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసిఆర్ రెవెన్యూ భూములతో సమానంగా పోడు భూములకు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని,గిరిజనులకు పోడు భూములతో పాటు ఉచిత విద్యుత్తు, రైతుబంధు,రైతు బీమా,పంట నష్ట మపరిహారం,వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాల సబ్సిడీ వంటి పథకాలను అమలు చేస్తున్నారని,విస్తీర్ణంలో అత్యధికంగా పోడుపట్టాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి అన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ములుగు ప్రాంతం నిరంతర పోలీసు కాల్పులతో, కరువు కాటకాలతో త్రాగునీటి ఇబ్బందులతో,అభివృద్ధికి దూరంగా ఉండేదని,నేడు సీఎం కేసీఆర్ పటిష్టమైన శాంతి భద్రతలు ఏర్పాటు చేసి ప్రతి పల్లెకు రోడ్డు ప్రతి ఇంటికి త్రాగునీరు,ప్రతి రైతుకు రైతుబంధు,ప్రతి పోడు భూమికి పట్టా,ప్రతి పేదింటి ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని,గతంలో ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవాల సంఖ్య 30 శాతం ఉంటే నేడు 76.8 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నాయని,రాష్ట్రంలోనే ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు నిర్వహించడంలో 87.1 శాతంతో రెండవ స్థానంలో ఉందని,దీనికి కృషి చేసిన వైద్యులకు సిబ్బందికి ప్రత్యేకంగా మంత్రి అభినందించారు.

ములుగు ప్రాంతంలో డాక్టర్లు లేక గతంలో ప్రజలు ఇబ్బందులు పడేవారని,నేడు ములుగు జిల్లా ఆసుపత్రిలో 28 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని, జిల్లాలోని 15 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 57 పల్లె దవఖానాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఏటూరునాగారం ములుగు ప్రాంతాలలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ములుగు జిల్లాలో ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటు చేస్తుందని, వైద్య కళాశాలతో పాటు ములుగు ప్రాంతంలో 400 పడకల ఆసుపత్రి ప్రజలకు సేవలు అందిస్తుందని, వచ్చే సంవత్సరం నుంచి 100కు పైగా వైద్యులు ములుగు జిల్లాలో సేవలు అందిస్తారని, బోక్కల వైద్యం, జనరల్ సర్జన్, ఫిజిషియన్, మత్తు డాక్టర్లు మొదలగు అన్ని రకాల వైద్య సేవలు ములుగులో అందుబాటులో ఉంటాయని, ఇకపై ఇక్కడి ప్రజలు వరంగల్ వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.గిరిజనుల దశాబ్దాల కల గూడాలను తండాలను గ్రామ పంచాయతీలుగా సీఎం కేసిఆర్ ఏర్పాటు చేశారని,ములుగు జిల్లాలో సైతం 65 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని,గిరిజనులకు విద్యలో ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించామని అన్నారు.గతంలో మారుమూల ప్రాంతాలైన ములుగు మహబూబాబాద్ భూపాలపల్లిలో వైద్యులు పనిచేసేవారు కాదని,డాక్టర్లు లేని చోట నేడు డాక్టర్ల ఉత్పత్తి జరిగే విధంగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.కొత్తగూడ గంగారంలో గిరిజనేతర భూములకు సైతం రైతుబంధు ఉచిత కరెంటు పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.కొత్తగూడ ప్రాంతానికి సాగునీటి అందించడం కోసం ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ములుగు ప్రాంతంలో గృహలక్ష్మి పథకం కింద అదనంగా ఇండ్ల మంజూరు, ఏటూరునాగారంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాలను సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం మంజూరుచేసే విధంగా కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కొత్తగూడలో నూతన ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, వెంటనే మంజూరు చేసి ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ములుగు ప్రత్యేక జిల్లా సీఎం కేసిఆర్ ఏర్పాటు చేశారని,మల్లంపల్లి మండల ఏర్పాటులో సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని మల్లంపల్లి మండల ఏర్పాటు చేసి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని మంత్రి అన్నారు.పోడు భూములు గిరిజన ఇతరులకు రాకుండా గత ప్రభుత్వలు చట్టాలు తీసుకొని వచ్చిందని మంత్రి తెలిపారు. గిరిజనుల చిరకాల ఆకాంక్ష తండాలు,గూడెంలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నామని, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు సాధించడంలో సీఎం కేసిఆర్ చొరవ ఉందని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వైద్య కళాశాల సీఎం కేసిఆర్ మంజూరు చేశారని తెలిపారు.మారుమూల గిరిజన ప్రాంతాలకు గతంలో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదని, 350 కోట్లు ఖర్చు చేసి ప్రతి గిరిజన గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేశామని, గిరిజనులకు రిజర్వేషన్ పెంచామని అన్నారు. ములుగు ప్రాంతానికి రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పాకాల చెరువు లక్నవరం ద్వారా దేవాదాల నుంచి అవసరమైతే అదనపు పైప్ లైన్లు వేసి సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు పెరిగాయని, మప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగిందని అన్నారు.కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వనప్పటికీ సీఎం కేసిఆర్ ప్రతి జిల్లాలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.హరీష్ రావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత విస్తృతంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని,గర్భిణుల కోసం కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ అనే నూతన పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగ జ్యోతి మాట్లాడుతూ మల్లంపల్లి మండల ఏర్పాటుకు సీఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలలో సైతం పల్లె దవఖానాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నామని,మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని,ములుగు పట్టణ అభివృద్ధికి 56 కోట్లు ఖర్చు చేసి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.ములుగు ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా అనేక ఇల్లు దెబ్బ తిన్నాయని,ములుగు ప్రాంతానికి అదనంగా 2000 ఇండ్లు గృహలక్ష్మి కింద అందించాలని,ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్పర్సన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మల్లంపల్లి మండలం ప్రకటించినందుకు సీఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు, మల్లంపల్లి మండలానికి జగదీష్ పేరు పెట్టాలని,ములుగు ప్రాంతానికి గోదావరి నీరు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని,పెండింగ్ పొడు పట్టాల పంపిణీ నిర్వహించాలని కోరారు. అనంతరం గృహలక్ష్మి దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,
ఐటిడిఏ పిఓ అంకిత్,ఎస్పీ గౌష్ ఆలం,
మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్,వాటర్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాష్,శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్,రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి,రోడ్ల అభవృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్,ఓడిసి ఎంఎస్ వైస్ ఛైర్మెన్ సమ్మారావు, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి,శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసిలు హరిబాబు,గై రుద్రమదేవి అశోక్,అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి,డిపిఓ వెంకయ్య, కలెక్టరేట్ ఏఓ ప్రసాద్,ములుగు తహశీల్దార్ విజయభాస్కర్,సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !