లక్షలు పెట్టి కట్టారు.. లక్షణంగా వదిలేశారు!
* నిరుపయోగం ఎన్ పవర్ మెంట్ సెంటర్
* ప్రారంభం కాకముందే శిథిలావస్థకు
* అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైనం
* మద్యం ప్రియులకు నిలయం
* కాళీ స్థలంపై కబ్జాదారుల కన్ను
* అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన శూన్యం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పేద కుటుంబాల వారు పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకునేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఎన్ పవర్ మెంట్ సెంటర్స్(కమ్యూనిటీ హాల్స్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తి సమీపంలో ఎన్ పవర్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. 2016 ఏడాదిలో సుమారు రూ.70 లక్షల నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టగా 90 శాతం వరకు పనులు పూర్తి కావడం జరిగింది. అయితే దీని గురించి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకోవడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు అండగా మారిందనే ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా మద్యం ప్రియులకు నిలయంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన మరుగుదొడ్ల సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ హాల్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలంపై కొందరు కబ్జాదారుల కన్ను పడిందని ఎప్పుడెప్పుడా అని స్థలాన్ని ఆక్రమించేందుకు తహతహలాడుతున్నారని ప్రజా సంఘాల వారు పేర్కొనడం విశేషం.
పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పినా..
జిల్లా కేంద్రంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ పై అధికారులు ఎవరు దృష్టి సాధించడం లేదని కొందరు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమ్యూనిటీ హాల్ ను వినియోగంలోకి తేవాలి..
నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్ ను వినియోగంలోకి తెచ్చే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు భూక్యా రమేష్ డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా ఉండడం వల్ల కబ్జాకు గురయ్యే అవకాశం ఉందని విషయాన్ని అధికారులు పరిగణంలోకి తీసుకొని పేద కుటుంబాల వారు పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకునేందుకు అందుబాటులోకి తేవాలని రమేష్ డిమాండ్ చేశారు.