మిరపలో తెల్లదోమలను సామూహికంగా నిర్మూలించాలి….
కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నారాయణమ్మ…
మన్యం న్యూస్ చండ్రుగొండ, అక్టోబర్ 05: మిరపలో బొబ్బతెగులు ఉదృతిని తగ్గించాలంటే తెల్లదోమను రైతులు సామూహికంగా నిర్మూలించాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నారాయణమ్మ సూచించారు. గురువారం గానుగపాడు గ్రామంలో బొబ్బ తెగులు వచ్చిన మిరపతోటలను శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఆమె పరిశీలించారు. మిరపతోటల్లో తెల్లదోమ ఉదృతిని శాస్త్రవేత్తల బృందం గుర్తించి, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. తెల్లదోమ నివారణకు తోటలో తెలుపు, పసుపు, నీలం రంగు గమ్ము అట్టలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఎకరానికి 50 అట్టలకు తగ్గకుండా ఏర్పాటు చేయటంతో పాటు, వేపనూనె 10వేల పిపిఎం 250 మిల్లీలీటర్లు ఒక పిచికారి చేయాలన్నారు. తోటలో కలుపు నివారణ సైతం ఎప్పటికప్పుడు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శివ, నవీన్ కుమార్, మండల వ్యవసాయశాఖాధికారి వినయ్, ఏఈఓలు శ్రీనివాస్, విజయ్, సాయిబాను, రైతులు,తదితరులు పాల్గొన్నారు.





