ఎన్నికలు నిజాయితీగా జరిగేందుకు అధికారులు పటిష్ట పర్యవేక్షణ చెయ్యాలి
*నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్
మన్యం న్యూస్,మణుగూరు:
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరిగేందుకు అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం పినపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోలీసు, రెవిన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వాహనాల రాక పోకలపై పటిష్ట నిఘా ఉండాలని చెప్పారు. ప్రతి వాహనాన్ని నిశిత పరిశీలన చేయాలని చెప్పారు. తనిఖీల్లో గుర్తించబడిన నగదు, విలువైన ఆభరణాలు, మద్యం తదితర వాటికి సమగ్ర నివేదికలు అందజేయాలని చెప్పారు. 24 గంటలు పట్టిష్ట నిఘా కొనసాగించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రాఘవేందర్ రావు, నియోజకవర్గ పరిధిలోని మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
