దసరా ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు
* తొమ్మిది రోజులపాటు అమ్మవారికి అలంకారాలు
* ప్రత్యేక పూజలు.. భక్తులతో సందడి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
విజయదశమి ఉత్సవాలకు జిల్లా కేంద్రంలో ఉన్న పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి తొమ్మిది రోజులపాటు వివిధ రూపాలలో అలంకారాలు చేయనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఆలయాలను ఇప్పటికే సిద్ధం చేశారు. కొన్ని దేవాలయాలకు విద్యుత్ లైట్లను అలంకరించడంతో రాత్రి సమయంలో జిగేల్ జిగేల్ గా కనిపిస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తి సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ పక్కన ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి విద్యుత్ దీపాలను అలంకరించారు. దేవాలయం ఆవరణలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి, రాధాకృష్ణుల విగ్రహానికి, శివుని విగ్రహానికి విద్యుత్తు లైట్లు వేయగా రాత్రి వేళల్లో కాంతులు విరాజిల్లుతున్నాయి. ఈనెల 15వ తేదీ నుండి విజయదశమి ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల ప్రారంభం మొదటి రోజు అమ్మవారికి బాల త్రిపుర సుందర దేవి అలంకరణ చేయడం జరుగుతుందని పెద్దమ్మ తల్లి దేవాలయం పూజారి త్యాగరాజ శర్మ తెలిపారు. తొమ్మిది రోజులపాటు దేవాలయంలో జరిగే విజయదశమి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.