మన్యం న్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండల పరిధిలోని మద్రాస్ తండా గ్రామపంచాయతీ కొండంగుల బోడ్ గ్రామవాసి జర్పుల సుందర్ కుమార్తె జర్పుల విద్యావతి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైనందున ఇల్లందు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బాదావత్ ప్రతాప్ శుక్రవారం వారి ఇంటికెళ్ళి విద్యావతికి శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ..విద్యావతికి ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి మారుమూల గ్రామాలలో గిరిజనబిడ్డలు చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవడం చాలా గొప్ప విషయమని, గిరిజనతండా, గూడాలలో యువతులకు విద్యావతి స్ఫూర్తిదాయకం అన్నారు. కష్టపడి శ్రమిస్తే సాధించలేనిది ఏమీలేదని ఆయన అన్నారు. యువతీ, యువకులు అందరూ చదువుమీద శ్రద్ధ వహించాలని అలాగే తల్లిదండ్రులు కూడా వారివిద్యకు ఆటంకం కలగకుండా ప్రోత్సహిస్తే విద్యావతి లాంటివారు ప్రతితండా, గూడాలలో తయారవుతారని పేర్కొన్నారు. చదువుకోవడానికి డబ్బుతో పనిలేదని మనలో ఆత్మస్థైర్యం, పట్టుదల, శ్రమ, చదువుమీద ఏకాగ్రత ఉంటే కచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్నారు. బిఎస్పి అధికారంలో వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, గ్రామప్రజలు, బిఎస్పి నాయకులు అరుణ్, వినోద్, తరుణ్, సంతోష్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.