సత్తా చాటాలి..
* తుమ్మలకు రాహుల్ గాంధీ ఆశీర్వాదం
* ఖమ్మం రాజకీయాలపై ఇరువురు చర్చ
* హస్తం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహం
* రాహుల్ తో తుమ్మల భేటీపై ఆసక్తికర చర్చ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే పోరులో సత్తా చాటాలని కాంగ్రెస్ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి
తుమ్మల నాగేశ్వరావును ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరావు చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీకి వెళ్లడంతో ప్రాధాన్యత సంచరించుకుంది. ఏఐసీసీ కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సూచన మేరకు శనివారం ఢిల్లీకి వెళ్లిన సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రాహుల్ గాంధీని కలిసి ఆయనతో కొద్దిసేపు భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, రాజకీయ వ్యూహాలపై కూడా చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇరువురి భేటీ అనంతరం రాహుల్ గాంధీని తుమ్మల నాగేశ్వరావు శాలువాతో సన్మానించారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీతో భేటీ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌ని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయాల తీరు గురించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు సమాచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ ఎక్కినట్లుగా కొంతమంది స్థానిక కాంగ్రెస్ నేతలు మాట్లాడుకోవడం గమనార్హం.