గుట్టకు కన్నం..
* అక్రమంగా గ్రావెల్ తరలింపు
* అనుమతులు ఒకచోట
* తవ్వకాలు మరోచోట
* పట్టినట్లుగా భూగర్భ గనుల శాఖ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భూగర్భ గని సంపద విస్తరించి ఉంది. ఈ సంపదపై అక్రమార్కులు కన్నేశారు. అవకాశాన్ని అదునుగా చేసుకొని కొందరు ఏకంగా సమీపంలో ఉన్న గుట్టలకు భారీ యంత్రాల ద్వారా కన్నాలు వేసి అందులో ఉండే విలువైన సంపదను లూటీ చేయడం పరిపాటిగా మారింది. వివిధ అవసరాల నిమిత్తం గ్రావెల్ కావాలనుకుంటే ఇటు రెవెన్యూ శాఖ నుండి అటు భూగర్భ గనుల శాఖ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు భూగర్భ కన్నుల శాఖ నుండి అనుమతులు తీసుకోకుండా కేవలం రెవెన్యూ శాఖ నుండి మాత్రమే అనుమతి తీసుకొని గ్రావెల్లో తరలించుకుపోవడం పట్ల విమర్శలకు దారి తీస్తుంది. ఇటీవల ఒక వ్యక్తి రెవెన్యూ శాఖ నుండి రవాణా కొరకు మాత్రమే అనుమతి తీసుకొని గుట్ట నుండి దొడ్డిదారిన ఎర్రమట్టి గ్రావెల్ తోలకం చేయడం గమనార్హం. అంతేకాకుండా తోలకం అనుమతి ఒకచోట ఉంటే మరోచోట నుండి రవాణా చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పరిధిలో ఉన్న ఒక గుట్ట నుండి పట్టపగలే భూగర్భంలో ఉన్న ఎర్రమట్టి గ్రావెల్ సంపదను దర్జాగా దోచుకుంటున్నారు. ఈ తంతు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పెద్దపెద్ద జెసిబి యంత్రాలను గుట్టకు ఉపయోగించి మట్టిని తీసుకొని వెళ్ళి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గుట్ట నుండి సరైన అనుమతి లేకుండా గ్రావెల్లో తరలిస్తున్నారని ప్రజా సంఘాల నాయకుల నుండి ఆరోపణలు విమర్శలు రావడం జరుగుతుంది. సంబంధిత అధికారులు స్పందించి అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ఉన్న గుట్ట నుండి సంపదను తరలిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.