UPDATES  

 ఛీ.. గలీజ్!

ఛీ.. గలీజ్!
* గ్రామాల్లో మురుగు నిల్వ
* రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీరు
* దోమల విస్తరణకు నిలయం
* పట్టించుకోని పంచాయతీ పాలకవర్గ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈ ఊరి పక్కన ఉన్న రహదారి గుండా పోతే అటువైపు చూసే జనం ఛీ.. ఇంత గలీజ్ గానా
అంటూ అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. కొందరి ఇండ్ల ముందు మురుగునీరు పేరుకుపోయి అందులో పాకురు అట్టలు కట్టి ఉండగా రోడ్లపై డ్రైనేజీ నీరు పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య కళ్ళ ముందు కనబడుతున్న పంచాయితీ పాలకవర్గం పట్టించుకోకపోవడం పట్ల విమర్శలకు తావిస్తోంది.
భద్రాద్రి జిల్లాకు అనుకొని ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ గ్రామంలో కొందరి ఇండ్ల ముందు మురుగు నీరు పెద్ద ఎత్తున పేరుకుపోయి అందులో పాకురు పట్టి తట్టలుగా తేలాడుతున్నాయి. అంతేకాకుండా డ్రైనేజీ నీరు ప్రధాన రహదారిపై పారుతుండడంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వారికి ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేకనా లేదా మరి ఏమైనా కారణం ఉందా అనే ఆలోచన కలుగుతుంది. ఒక దిక్కు సీజనల్ వైరల్ జ్వరాలు విజృంస్తుండగా ఈ గ్రామంలో మాత్రం పేరుకుపోయిన మురుగును చూస్తే వామ్మో ఇంత దారుణమా అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి కనబడడం విచారకరం. మురుగునీటితో దోమలు విస్తరణకు కారణమవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పెరుగుతున్న దోమలతో మలేరియా డెంగ్యూ వైరల్ విష జ్వరాలు వస్తుండడంతో జనం వనికి పోతున్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి..
సాటివారిగూడెం గ్రామపంచాయతీతో పాటు మరికొన్ని గ్రామపంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతుంది. పేరుకుపోయిన మురుగునీటి వల్ల చెత్తాచెదారంతో వివిధ రకాల వ్యాధులు రావడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు సతమతమవుతున్నారు. సీజన్ లో వచ్చే వ్యాధులపై సరిగ్గా లేని పారిశుధ్యంపై పలు పంచాయతీల అధికారులు అవగాహన కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వార్డుల్లో పడకేసిన పారిశుధ్యం..
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో పారిశుధ్యం మడికేసిందనే ప్రచారం లేకపోలేదు. వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం జరగడం లేదనే వాదన వినిపిస్తుంది. దీనికి కారణం అధికారుల లేక పాలకవర్గమా అంటూ ప్రజల నుండి అసహనం వెల్లువెత్తుతుంది. సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !