మన్యం న్యూస్: వైరా నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 15, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని బంజారా జెఎసి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూక్య దేవిలాల్ నాయక్ తెలిపారు. ఆదివారం కారేపల్లి మండలం రేలాకాయపల్లి గ్రామంలో బంజారా నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవిలాల్ నాయక్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లు పెండింగులో ఉండటం వలన గిరిజనులు నష్టపోతున్నారన్నారు.జిఓ నంబర్ 3 ను సుప్రీంకోర్టు కొట్టివేయటంతో ఏజన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా ప్రధాన రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని దేవిలాల్ నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. బిఆర్ఎస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ స్థానికులకు టిక్కెట్ ఇవ్వకుండా ఇతర నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకు టిక్కెట్ కేటాయిస్తే స్థానికుడిగా గత పదేళ్లుగా బంజారాలకు సేవచేస్తున్న నేను మీ అందరి సంపూర్ణ మద్దతుతో బంజారాల పోటీలో ఉంటానని స్పష్టంచేశారు.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్ధిగా వైరా నియోజకవర్గంలో నామినేషన్ వేసినట్లు తెలిపారు.ప్రత్యేక పరిస్థితుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ కోసం నామినేషన్ ఉపసంహరించుకొని రాములు నాయక్ గెలుపుకోసం కృషి చేశానన్నారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకునిగా నియోజకవర్గంలో ప్రజల కష్టాల్లో అండగా ఉంటున్నానని దేవిలాల్ నాయక్ తెలిపారు.వైరా నియోజకవర్గంలో అత్యధికంగా లంబాడా,గిరిజన ఓట్లు ఉన్నా అధికార,ప్రతిపక్ష పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి, మెజారిటీతో గెలిపిస్తే లంబాడి హక్కుల కోసం పోరాడతానని దేవిలాల్ నాయక్ బంజారా సమాజాన్ని కోరారు.
