హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవుల రేసులో తాను లేనని..
పదవులే తనని అందుకుంటున్నాయన్నారు. ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి ఎలా అయ్యారో.. తాను కూడా అలానే సీఎం కావచ్చని జానా రెడ్డి అన్నారు. ఆరు నెలల్లో పదవిలోకి రావడానికి తన కొడుకు రాజీనామా చేస్తాడని, తాను పోటీ చేసి గెలుస్తానని అన్నారు.
‘నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదు అనను. ఏ సీఎం చేయనన్ని శాఖలు నేను నిర్వర్తించా. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా. 36 ఏళ్లకే మంత్రి అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతటవే వస్తాయి’ అని జానా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. సీనియర్ నేతలంతా సీఎం పదవికి పోటీలో ఉన్నామంటూ ప్రకటనలు చేసే విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జానా రెడ్డి మాత్రం ఈసారి అందరికంటే ముందే తానే ఆ పదవి కోసం పోటీలో ముందున్నానంటూ చెప్పకనే చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తెలంగాణలో పోటీలో లేనట్లుగా అనిపించిన కాంగ్రెస్.. ఒక్కసారిగా సరిగా రేసులోకి దూసుకొచ్చింది. పలువురు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరింత జోరు మీదుంది. దీంతో అధికారం తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవిపై జానా రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గెలుపు తర్వాతే ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.