హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. మరోవైపు, మద్యం, కానుకల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ.. సరైన పత్రాలు లేని నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేస్తున్నారు.
కార్లను మొదలుకొని ఆర్టీసీ బస్సులు, బైకులు ఇలా ఏ వాహనాన్నీ వదలకుండా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. రూ.50 వేలకు మించి నగదు పట్టుబడితే సరైన పత్రాలు లేనిదే వదలడం లేదు. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, ఆభరణాలు, కానుకలు, మాదక ద్రవ్యాల విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటడం గమనార్హం.
ఇప్పటి వరకు అన్ని రకాలుగా లభించిన మొత్తం రూ.130 కోట్ల 26 లక్షల 91 వేల 531గా అధికారులు వెల్లడించారు. 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం వరకు రూ.21 కోట్ల 84 లక్షల 92 వేల 242 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.71 కోట్ల 55 లక్షల 58 వేల 94 నగదు పట్టుబడింది.
అంతేగాక, 52,091 లీటర్ల మద్యం, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల ఆలం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.ఏడు కోట్ల 75 లక్షల 79 వేల 917 లుగా అధికారులు తెలిపారు. రూ.4 కోట్ల 58 లక్షల నాలుగు వేల 720 విలువైన
694 కిలోల గంజాయి పట్టుబడింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 72 కిలోలకు పైగా బంగారం, 420 కిలోలకు పైగా వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.40 కోట్ల ఎనిమిది లక్షల 44, 300లుగా ఉంది. స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి మొదలైన కానుకల విలువ రూ.6 కోట్ల 29 లక్షల 4 వేల 500లుగా అధికారులు స్పష్టం చేశారు.