మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం ప్రధాన సెంటర్లో ఎన్నికల పరివర్తన నియమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల కోడ్ అమలవుతున్న ప్రస్తుత సమయంలో అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని తాత్కాలిక ఆవేశ కోపాలకులోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులుతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని తెలిపారు. రాజకీయ పార్టీల వర్గాల పోరు వలన గొడవలకు పాల్పడవోద్దని నేర చరిత్ర రికార్డులోకెక్కి జీవితాలు నాశనం చేసుకోవోద్దని అన్నారు. నేర ప్రవర్తన జీవితాంతం తలా పాపం తిలపిడికెడు అన్న చందంగా వెంటాడుతూనే ఉంటుందని తన కోపమే తన శత్రువని విశ్లేషించారు. చట్టం అందరికీ చుట్టమే కానీ తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రచారాలకు రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని పర్మిషన్ కోసం ఈ సువీధ యాప్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత ప్రచార సమయం వరకే ప్రచారం నిర్వహించుకోవాలని ప్రచారంలో ఎదుటివారిపై ఆధారాలు లేని ఆరోపణలు కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఓట్లు కోసం నగదు పంపిణీ చేయకూడదని తెలియజేశారు. ఎన్నికల పరివర్తన నియమాలను ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదుల కోసం
సి విజిల్ యాప్ ప్రాముఖ్యత గురించి వివరించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు శిక్షలు తప్పవు అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన నియమాలను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
అవగాహన కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సబ్ ఇన్స్పెక్టర్ షాహినా పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.