సింగరేణి లాభాలవాటా పంపిణీ నిలిపివేతను ఖండించిన బిఎంఎస్
రాష్ట్రప్రభుత్వం కార్మికుల కష్టార్జితం లాభాలవాటాను తక్షణమే చెల్లించాలి
బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు
మన్యం న్యూస్,ఇల్లందు:రాజకీయ చదరంగంలో రాష్ట్రప్రభుత్వం సింగరేణి కార్మికులకు లాభాలవాటాను నిలిపివేయడాన్ని బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు ఖండించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇల్లందు జీఎం కార్యాలయంలో ఎస్వోటూ జీఎం మాల్లారపు మల్లయ్యకు నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం నాయని సైదులు మాట్లాడుతూ..సింగరేణి కార్మికులకు లాభాలవాటా 711.18 కోట్ల రూపాయలను అక్టోబర్ 16న చెల్లిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ఈ నెల 4న సర్కులర్ జారీచేసిందని తెలిపారు. సింగరేణి లాభాలలో 32శాతం కార్మికులకు ఇస్తున్నట్లు గతనెల 29న రాష్ట్రప్రభుత్వ కార్యదర్శి ప్రకటించారని కానీ నేడు అసెంబ్లీ ఎన్నికల కోడ్ ప్రకటన రాగానే లాభాలవాటాను నిలిపివేయడం దారుణమన్నారు. సింగరేణి సంస్థలాభాలు కార్మికుల కష్టార్జితమని రాష్ట్రప్రభుత్వం నుండి ఇచ్చేసొమ్ము కాదని, 135 సంవత్సరాల సింగరేణి చరిత్రలో కార్మికుల ఆర్థిక ప్రయోజనమైన లాభాల్లో వాటాను నిలిపివేయడం సింగరేణి కార్మిక కుటుంబాలలో మానసిక అశాంతిని, నిరాశను కలిగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే లాభాలవాటా చెల్లింపును యాజమాన్యం ప్రకటించిందని కార్మికులకు లాభాలవాటా చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ డిమాండ్ చేస్తుందని నాయని సైదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, వెంకటేశ్వర్లు, రమేష్, వెంకట్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.