మన్యం న్యూస్ గుండాల: నిర్భయంగా మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ ప్రజలకు సూచించారు. సెంట్రల్ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటును వేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో భారీ కవాతును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరు పార్టీలపైన కానీ వ్యక్తులపైన కానీ దూషణలకు దిగి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో సైతం తప్పుడు సమాచారాన్ని పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలింగ్ స్టేషన్స్ వద్ద సిఆర్పిఎఫ్ లోకల్ పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఓటర్లు ఎటువంటి అపోహలు లేకుండా ఓటును వినియోగించుకోవాలని అన్నారు. ఈసారి వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్ద నుండి ఓటు వేసుకునే సదుపాయం ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీల నాయకులు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు పాల్గొన్నారు
