మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 5వ తేదీన కొత్తగూడెంలో జరగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ దద్దరిల్లిపోవాలని రాజ్యసభ సభ్యుడు ఎంపీ భద్రాద్రి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని
బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో ఎంపీ వద్ది రాజు సమావేశమయ్యారు. సీఎం సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ సభను దిగ్విజయం చేసేందుకు నాయకులతో పాటు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేసి బీఆర్ ఎస్
సత్త ఏంటో మరోమారు చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలో ఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని అన్నారు. బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి సమాచారం వివరాలు తనతో పాటు పార్టీ పెద్దలందరికి ఎప్పటికప్పుడు తెలుస్తుందని కార్యకర్త నుంచి మొదలు నాయకుల వరకు కష్టపడే వారికి గుర్తింపు లభించడంతోపాటు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మనమందరం మరింత కృషి సల్పి రాజకీయాలలో 50ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వనమాను భారీ ఓట్ల మెజారిటీతో మరోసారి గెలిపిద్దామని ఎంపీ రవిచంద్ర నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,
భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని), కొత్తగూడెం మునిసిపల్ వైస్ ఛైర్మన్ వీ.దామోదర్, బీఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, మండే హన్మంతరావు, జేవీఎస్ చౌదరి, భీమా శ్రీధర్, భూక్యా రాంబాబు, కొత్వాల శ్రీనివాస్, బత్తుల వీరయ్య, లక్కినేని సత్యనారాయణ, రాజుగౌడ్, పూసల విశ్వనాథం, శ్రీరాంమూర్తి, కొట్టి వెంకటేశ్వర్లు, కంభంపాటి దుర్గాప్రసాద్, బరపాటి వాసుదేవరావు, రజాక్, అనుదీప్, కాంపెల్లి కనకేష్ పటేల్, శ్రీనివాస్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.