మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ,మెదక్ ఎంపీ దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పై కాంగ్రెస్ నాయకులు చేసిన హత్యాయత్నాన్ని వారు తీవ్రంగా ఖండించారు.ప్రజా క్షేత్రంలో ఇటువంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.ఇలాంటి హత్య రాజకీయాలు,హిసంత్మక చర్యలు ఎవరు చేసిన సహించేది లేదు అన్నారు. ఎన్నికల సమయం లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక ఈ విధమైన దాడులకు పాల్పడడం దారుణం అన్నారు. ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా పార్టీలకు ఆతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు.దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.బిఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక,చేతకాక కాంగ్రెస్ నాయకులు దొడ్డి దారిన దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఇటువంటి దాడులను అందరు తిప్పి కొట్టాలన్నారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధి,సంక్షేమ పరిపాలన చేయడం జరిగిందన్నారు.కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను న్యాయం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి 14 ఏళ్లు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ,నేడు కొత్త మోసానికి తెరలేపిందన్నారు.అమలు కానీ హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అన్నారు. ఒక్కసారి చేసిన తప్పుకు 60 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం అనేక ఇబ్బందులను,సమస్యలను అనుభవించిందని,మరల అటువంటి తప్పు జరగకుండా ప్రజలు ఆలోచించి,రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహ రావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,సీనియర్ నాయకులు ఆవుల నరసింహారావు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.