- తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం
- దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
- కౌలు రైతులను పాలకులు ఆదుకోవాలి
- ధరణి పోర్టల్ అన్నదాతలకు నష్టం
- కొత్తగూడెం జనసేన సభలో పవన్ కళ్యాణ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జనసేన పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కొత్తగూడెం అభ్యర్థి లక్కినేని సురేందర్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం సింగరేణి ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందని వారు గెలుపు కోసం పర్యటిస్తున్నట్టు తెలిపారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఒక బీజేపీతోనే సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన విజయవంతంగా నడుస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ పథకాలు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో అమలవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం మోడీ కృషి మరువలేనిదన్నారు. కేంద్ర నిధులతో రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ఉన్నాయని తెలిపారు. రైతులనే కాకుండా కౌలు రైతులను సైతం పాలకులు ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపితే దేశం మరింత అభివృద్ధిలో ముందుకు పోతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
*ధరణి పోర్టల్ అన్నదాతలకు నష్టం…*
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు నష్టమేనని లాభం లేదని జనసేన అధినేత వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ధరణి పోర్టల్ విజయవంతం కాలేదని స్వయంగా ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు. రైతులకు ఉపయోగం లేని ఈ ధరణి పోర్టల్ ను ఎత్తివేయాలని కోరారు. కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి పాలకులు మరింత కృషి చేయాలని సూచించారు.
*యువతకు ఉద్యోగాలు కల్పించాలి…*
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం పాలకులపై ఉందన్నారు. అనేక మంది యువకులు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. యువత కోసం తాను అండగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీకి దశలివారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగ సమస్య తీరడంతో పాటుగా యువతకు సైతం ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అన్నారు. వచ్చే సంవత్సరం నుండి తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టి యువతను అన్ని రంగాల్లో చైతన్యవంతులను
చేసి అండగా నిలిచి ఉద్యోగాలు కల్పించే విధంగా తన వంతుగా కృషి చేయడంతో పాటు జనసేన పార్టీని సైతం బలోపేతం చేస్తామని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సభలో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి లక్కినేని సురేందర్, కొత్తగూడెం బిజెపి జిల్లా అధ్యక్షుడు కె.వి రంగా కిరణ్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.