మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు.
కొత్తగూడెం మునిసిపల్ కార్యాలయంలో గురువారం మునిసిపల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సజావుగా నిర్వహించినందుకు మునిసిపల్ కమిషనర్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా ఆశీర్వాదంతో గెలుపొందిన నూతన కొత్తగూడెం శాశనసభ్యులు కునంనేని సాంబశివరావుకి శుభాకాంక్షలు తెలిపారు. వారి సలహాలు సూచనలు తీసుకుంటూ కొత్తగూడెం మునిసిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తామని అధికారులు అందరూ గత ప్రభుత్వంలో ఏ రకంగా సహకరించారో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే విధమైన సహకారాన్ని అందిస్తూ విధులు నిర్వహించాలని కోరారు. అధికారులు వారి వారికి నిర్దేశించిన విధులను సమయపాలన పాటిస్తూ సకాలంలో నిర్వహించాలని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఎన్నికల కోడ్ వలన నిలిపివేయబడిన పనులన్ని వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెండు రోజులుగా భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన మురికి కాలువలను శుభ్రపరిచి ప్రతి వార్డులలో బ్లీచింగ్ ఫాగింగ్ నిర్వహించి జ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పారిశుద్ధ్య విభాగానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రఘు డిప్యూటీ ఇంజనీర్ రవి మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.