తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటోన్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లింది. దీనికి శస్త్ర చికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నారు.
కేసీఆర్ పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తోన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. కేసీఆర్‌ను పరామర్శించారు.
తాజాగా- మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో చేరారు. కొద్దిసేపటి కిందటే యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కవితను కలిశారు. వారితో కలిసి నేరుగా కేసీఆర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న గదికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో చిరంజీవి వెంట బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు.
కేసీఆర్‌కు అందిస్తోన్న ట్రీట్‌మెంట్‌పై చిరంజీవికి అప్‌డేట్స్ ఇచ్చారు డాక్టర్లు. ఆయనకు అందిస్తోన్న వైద్యం గురించి వివరించారు. తుంటి ఎముక రీప్లేస్ చేశామని, ఇప్పుడిప్పుడే వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్‌తో రోజూ కొన్ని నిమిషాల పాటు వాకర్ సహాయంతో నడిపిస్తోన్నారు డాక్టర్లు. ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్‌తో ట్రీట్‌మెంట్ ఇస్తోన్నారు.