తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటోన్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లింది. దీనికి శస్త్ర చికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నారు.
కేసీఆర్ ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నాయకులు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వేగంగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.
Former CM KCR released a video from the hospital, here what he said
మరోవంక- కేసీఆర్ పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తోన్నారు. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు కొత్త మంత్రులు, బీఆర్ఎస్ శాసన సభ్యులు, త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్‌ను పరామర్శించారు. సోమవారం వారిద్దరూ వేర్వేరు సమయాల్లో యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్- తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆసుపత్రి బెడ్‌పై నుంచి ఈ వీడియోను రిలీజ్ చేశారాయన. వివిధ పార్టీల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులు, అభిమానులు, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కెేసీఆర్ మాట్లాడారు. తనను పరామర్శించడానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Former CM KCR released a video from the hospital, here what he said
వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచీ తనను పరామర్శించడానికి వందలాదిమందిగా తరలివస్తోన్నారని గుర్తు చేశారు. రోజూ వందలాది మంది తనను పరామర్శించడానికి వస్తోండటం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారని, అది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని, చాలా అవస్థలు వస్తాయని, నెలల తరబడి బయటికి వెళ్లలేని దుస్థితి రావొచ్చని వివరించినట్లు తెలిపారు.
కనీసం ఇంకో 10 రోజుల వరకూ ఎవరూ కూడా ఆసుపత్రికి తరలిరావొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వీఐపీలు ఆసుపత్రికి వస్తోండటం వల్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారని దీనివల్ల వందలాది మంది పేషెంట్లు, వారి బంధుమిత్రులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కేసీఆర్ చెప్పారు.
తన ఆరోగ్యం కుదుటపడిన తరువాత తానే జనంలోకి వస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆసుపత్రి వద్ద వేచి ఉంటోన్న వందలాది మంది కార్యకర్తలు, పార్టీ అభిమానులు వెంటనే తమ స్వస్థలాలకు సురక్షితంగా తరలి వెళ్లాలని కోరారు. కేటీఆర్, అక్బరుద్దీన్ ఒవైసీ దీనిపై ఓ ప్రకటన చేస్తారని పేర్కొన్నారు.