ప్రజారవాణాకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించే విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టిన నగరంగా షెన్జెన్ 2017లోనే రికార్డులకి ఎక్కింది. తద్వారా 2050 నాటికి నెట్ జీరో సాధించే విషయంలో చైనా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే విషయంలో చైనా అగ్రగామిగా నిలిచిందని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ డెవలప్ మెంట్ పాలసీ(ITDP) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెదర్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు.
బస్సుల ఎలక్ట్రిఫికేషన్ చేపట్టడం ఓ రకంగా కీలక వ్యూహమనే చెప్పాలి. దీని వల్ల రవాణా రంగంలో 5% కర్బన ఉద్గారాల బెడద తప్పుతుంది. 2021నాటికే గ్లోబల్ ఎలక్ట్రిక్ అండ్ ట్రక్ మార్కెట్లో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల్లో 90 శాతం డ్రాగన్ దేశానివేనని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పొర్టేషన్(ICCT) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా 4.25 లక్షల ఈ-బస్సులు ఉంటే.. వాటిలో 4.21 లక్షలు చైనాలోనే రోడ్లపైకి వచ్చాయి. యూరప్‌లో 2250 బస్సులు, అమెరికాలో 300 బస్సులు మాత్రమే అప్పటికి తిరుగుతున్నాయి. అయితే 2032 నాటికి ప్రపంచంలోని మొత్తం బస్సుల్లో సగం ఎలక్ట్రిక్ బస్సులే ఆక్రమిస్తాయని బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ అంచనా వేసింది. అయినా బస్సుల ఎలక్ట్రిఫికేషన్ విషయంలో లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలు ఇంకా వెనుకే ఉన్నాయని థాంప్సన్ అభిప్రాయపడ్డారు.
ఏళ్ల పాటు పక్కా ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆటోమేకర్లకు ప్రభుత్వ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు చైనా విజయానికి బాటలు వేశాయి. సవాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ప్రధాన నగరాల్లో 90% మేర విద్యుత్తు బస్సులను చైనా ప్రవేశపెట్టగలిగింది. భారత్ కూడా ఈ విషయంలో దూకుడుతోనే ఉంది.
రానున్న నాలుగేళ్లలో 50 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అమెరికా సాయం తీసుకోనుంది. జాయింట్ ఫైనాన్స్ మెకానిజం ద్వారా ఈ-బస్సులను రోడ్డెక్కించాలని నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా ప్రభుత్వంతో పాటు దాతృత్వ సంస్థలు నుంచి 150 మిలియన్ డాలర్లు, భారత ప్రభుత్వం 240 మిలియన్ డాలర్లతో ఓ నిధిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇండియాలో 12 వేల ఈ-బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో చైనా పురోగతిని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలి. 2050 నాటికి నెట్ జీరో సాధన విషయంలో చైనాలాగే మిగిలిన దేశాలన్నీ దూకుడు ప్రదర్శించాలి. షెన్జెన్లో డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కర్బన్ ఉద్గారాలు 53% మేర తగ్గాయి. ఏటా 1,94,000 టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ నుంచి ఈ నగరం విముక్తి పొందిందని అధ్యయనాల్లో వెల్లడైంది.
అయినా.. కర్బన ఉద్గారాల కట్టడిలో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించే విషయంలో కాప్-28లో దేశాలు ఏకతాటిపైకి రాలేకపోవడం విషాదకరమే. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన శిలాజ ఇంధనాల వాడకాన్ని దశలవారీగా తగ్గించాలన్న డీల్ డ్రాఫ్ట్‌పై పలు దేశాలు అభ్యంతరాలు తెలిపాయి. శిలాజ ఇంధనాలకు బదులుగా రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని 2030 కల్లా మూడింతలు చేసేందుకు 130 దేశాలు మాత్రమే అంగీకారానికి వచ్చాయి.