భారత్ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా సభలోకి దూకారు. దీంతో ఎంపీలందరూ షాక్ కు గురయ్యారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు సభలోకి దూకి అలజడి సృష్టించారు. సభలో టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలందరూ ఒక్కసారిగా తమ సీట్ల నుంచి లేచి పరుగులు పెట్టారు.
సభ్యులు కూర్చునే టేబుళ్లపైకి దుండగులు ఎక్కారు. నల్ల చట్టాలను బంద్ చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఎంపీలు తొలుత ఆందోళనకు గురైనా.. వెంటనే అప్రమత్తమయ్యారు. దుందగులను చుట్టుముట్టారు. వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.ఈ ఘటన జరిగిన వెంటనే స్పీకర్ లోక్ సభ వాయిదా వేశారు.
సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. మళ్లీ అలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకోవడం భద్రతా వైఫల్యాన్ని చూపిస్తోంది. లోక్ సభలో దుండగులు చొరబడటం భద్రతా వైఫల్యమేనని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
లోక్ సభలోకి చొరబడిన ఒక వ్యక్తిని సాగర్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లను ఇద్దరు ఆగంతకులు దూచుకుని గ్యాలరీలోకి వచ్చారు. అక్కడ నుంచి కిందకు దూకారు. ఆ తర్వాత లోక్ సభలో టియర్ గ్యాస్ వదులుతూ అలజడి సృష్టించారు.
2001 డిసెంబర్ 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు , ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. ఆ టెర్రరరిస్టులు భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో హతమయ్యారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి బుధవారం ఉదయం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మ,ఎంపీలు నివాళులు అర్పించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే పార్లమెంట్ లోకి దుండగులు చొరబడటం తీవ్ర సంచలనం రేపింది.