వడ్డీరేట్లపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు. ఈ ప్రకటనతో రెపోరేటు 6.5 శాతం వద్దే స్థిరంగా కొనసాగనుంది. వరుసగా ఐదోసారి కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బుధవారం జరిగిన RBI ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని శక్తికాంతదాస్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా, నాల్గవ త్రైమాసికంలో 5.2 శాతం ఉండవచ్చని తెలిపింది.
2023-24లో దేశ జీడీపీ వృద్ధిపేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ పెంచింది. మూడవ త్రైమాసికంలో 6.5 శాతంగా, నాల్గవ త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాల్లో వృద్ధిరేటు వరుసగా 6.7, 6.5, 6.4 శాతాలుగా ఉండవచ్చని పేర్కొంది. రూపాయి విలువలో కూడా ఒడిదుడుకులు తక్కువగా ఉన్నాయని శక్తికాంత దాస్ వివరించారు.
2023 డిసెంబర్ 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చేసే యూపీఐ చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్ పరిమితిని రూ.15 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.