UPDATES  

 పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఆందోళనలు.. 81 మంది ఎంపీల సస్పెన్షన్..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో కీలక పరిణామం జరిగింది. లోక్ సభ నుంచి 33 మంది ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ 34 మంది ఎంపీలపై వేటు పడింది. లోక్ సభ నుంచి ముగ్గురి సస్పెన్షన్ ను, రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీల సస్పెన్షన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దీంతో మొత్తంగా 81 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేసినట్లయింది. లోక్ సభలో జరిగిన స్మోక్ బాంబు దాడిపై హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాల ఆందోళన చేపట్టాయి.

 

ఈ క్రమంలోనే చర్చకు అనుమతించాలని కోరుతూ వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు సభ సజావుగా జరగ కుండా పలుమార్లు అడ్డుకోవడంతో.. ప్రతిపక్ష పార్టీల ఎంపీ లను లోక్ సభలో సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇటు రాజ్యసభలోనూ చైర్మన్ వేటు వేశారు.

 

లోక్ సభ లో సస్పెండ్ అయిన ఎంపీల్లో 33 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా .. మరో ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే. జయకుమార్, విజయ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు.

 

సస్పెన్షన్ పై అధిర్ రంజన్ మాట్లాడుతూ తనతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన ఎంపీలను తిరిగి అనుమతించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం వల్ల జరిగిన ఘటనపై హోం మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేశాం, దీంతో స్పీకర్ సస్పెండ్ చేయడం విడ్డూరమన్నారు.

 

లోక్‌సభ మంగళవారానికి వాయిదా..

‘భద్రతా వైఫల్యం’పై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ కార్యకలాపాలు స్తంభించాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !